Thursday, August 13, 2020

పౌరసత్వమూ దేశద్రోహమూ!


Aug 13 2020 @ 02:02AM

సాయిబాబా ముందు మనిషి. ఆ తర్వాత విశ్వాసాల కారణంగా ఖైదీ. రాజకీయ పరిభాషలో రాజకీయ ఖైదీ. ఆ తర్వాతే వికలాంగుడు. ముందుగా మనిషికి హక్కులుంటాయి. గుర్తించండి. వాటినే మానవహక్కులు అంటున్నాం. కాపాడండి. ఆ హక్కుల కోసమే దేశదేశాల ఆలోచనాపరులు గొంతుకలుపుతున్నారు. విజ్ఞాపనలు వినండి. కోర్టుల్ని స్వతంత్రంగా వుండనివ్వండి.


నేను ఈ దేశ పౌరుణ్ణి!

నా దేశం గురించి నేను రాస్తాను. మాట్లాడతాను. పాట పాడుతాను. ఎందుకంటే యిది నా దేశం. నేను ఈ దేశ పౌరుణ్ణి!


నా దేశాన్ని కీర్తించే హక్కు నా పాలకుల్ని మెచ్చే హక్కు నిందించే హక్కు నాకుగాక యింకెవరికి వుంటుంది? - అని నమ్మి నడిచిన సాయిబాబా దేశం గురించి మాట్లాడడం దేశద్రోహమయిపోయింది. 


ఢిల్లీ యూనివర్సిటీలో... అదీ తను పనిచేస్తున్న యూనివర్సిటీలో రిజర్వేషన్లు అమలు చెయ్యమని రాజ్యాంగబద్ధమైన హక్కుతో కోరడం నేరమైపోయింది. యూజీసీకి పిర్యాదు చేయడం మరీ పెద్ద నేరమైపోయింది. రిజిస్ట్రార్ని రీకాల్ చెయ్యడం పెద్దలకు మహా అవమానమయిపోయింది. రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాల్సిరావడం మరీ అన్యాయమైపోయింది. అంతేనా?, నోరులేని ఆదివాసీలకు మద్దతుగా గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా గొంతువిప్పడం దేశద్రోహమయిపోయింది. కార్పొరేట్ వ్యాపారులు వెనక్కి తగ్గడం దేశవిదేశాల్లో దేశానికి అవమానం అయిపోయింది. అందుకనే సాయిబాబాపై కక్ష గట్టింది. ఖైదుని చేసింది. అండా సెల్లో పెట్టింది.


తెలిసిన కథకైనా తెలియని నేపథ్యం వొకటి వుండాలి. అప్పుడే కథ రక్తి కడుతుంది. రంజింపజేసే చట్టబద్ధత వస్తుంది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహేరి పోలీస్టేషన్ పరిధిలో దొంగతనం జరిగింది. అక్కడ దొంగలించిన సామాన్లు యిక్కడ సాయిబాబా వాళ్ళ యింట్లో బయటపడ్డాయి. సెర్చ్ వారెంటుతో వచ్చారు. ఇంటిని దోపిడి చేశారు. సొంత సరంజామా సాక్ష్యంగా పెట్టారు.


సాయిబాబాని కిడ్నాప్ కూడా చేశారు.

ఎందుకంటే- ‘సత్యమేవజయతే’ మన నినాదం!

అండా సెల్లో బంధించడం హింస కాదు. ఆసరా లేనిదే దైనందిన జీవితం గడవని మనిషిని వొంటరిని చేయడం హింస కాదు. అనారోగ్య పరిస్థితుల్లోనూ కనీస వైద్య సౌకర్యాలు అందించకపోవడం హింస కాదు. మిగిలిన ఖైదీలతో మాట్లాడనివ్వకపోవడమూ హింస కాదు. ప్రశ్నించిన మనిషిని నేరస్థుణ్ణి అంతకన్నా యెక్కువ దేశద్రోహిని చేస్తే వాళ్ళ భార్యా పిల్లలూ తల్లీ కుటుంబమూ సంబంధాలూ తెగి యీ సంఘంలో యెలాంటి స్థితిని యెదుర్కొన్నా అది హింస కానే కాదు.


ఎందుకంటే- ‘అహింస పరమో ధర్మః’ మన నినాదం!

ఏ దేశమైనా అది మిగతా దేశాలతో యెలా వ్యవహరిస్తోందనే దానికన్నా ఆ దేశంలోని ప్రజలతో- ముఖ్యంగా హక్కులకోసం నిలబడ్డ ప్రజాస్వామిక వాదులతో యెలా ప్రవర్తిస్తోందన్నదే ఆ దేశం యెలాంటిదన్నది నిర్ణయిస్తుంది. ఏ దేశంలోనైనా చట్టాలు ముఖ్యంగా కొత్తగా తెస్తున్న చట్టాలు ఆ దేశ పాలకుల గుణాన్ని దేశ భవిష్యత్తుని బైట పెడతాయి.

కుక్కర్ విజిల్‌కే గక్కురుమంటున్నారే? విజిల్ ని సీల్ చేస్తున్నారే? కుక్కర్ యేమవుతుంది? మీరు కోరుకున్న నిశ్శబ్దం మీకు సిద్ధిస్తుందా?


ఎందుకంటే- ‘విమర్శ ప్రజాస్వామ్యాన్ని తీర్చిదిద్దుతుంది’ 

అని కదా మన మేధోవాదం!

సాయిబాబా ముందు మనిషి. ఆ తర్వాత విశ్వాసాల కారణంగా ఖైదీ. రాజకీయ పరిభాషలో రాజకీయ ఖైదీ. ఆ తర్వాతే వికలాంగుడు. ముందుగా మనిషికి హక్కులుంటాయి. గుర్తించండి. వాటినే మానవహక్కులు అంటున్నాం. కాపాడండి. ఆ హక్కుల కోసమే దేశదేశాల ఆలోచనాపరులు గొంతు కలుపుతున్నారు. విజ్ఞాపనలు వినండి. కోర్టుల్ని స్వతంత్రంగా వుండనివ్వండి.


మరోపక్క వాళ్ళ వాళ్ళ విశ్వాసాల కారణంగానే యెందరో ప్రాణాలు తీసిన హంతకులు బెయిల్లమీద బయట తిరుగుతున్నారు. నిర్దోషులుగా బయటపడుతున్నారు. పాలనలోనూ భాగమవుతున్నారు. అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఇటుపక్క సాయిబాబా, వీవీ లాంటి మరెందరో జైళ్ళలో మగ్గుతున్నారు.


ఎందుకంటే- ‘ఎవరి విశ్వాసాలను వాళ్ళు కలిగివుండవచ్చు’ 

అన్నది మన నినాదం!

రాజ్యాంగం ముందు ప్రజలందరూ సమానమేనని చెప్పిన నేరానికి ప్రజాస్వామ్యం బోనెక్కింది. ఇది దేశానికి గౌరవం కాదు. మన భారతదేశం పేరు మంటగలపకండి.


సాయిబాబా విడుదల కోరుతూ ప్రపంచవ్యాప్త విజ్ఞప్తులతో వచ్చిన ‘ఎకో ఆఫ్ ఫ్రీడమ్’ బుక్ రిలీజు రోజునే సాయిబాబా తల్లి సూర్యవతమ్మ చనిపోయారు. తల్లిని చూడాలని సాయిబాబా చేసుకున్న వినతులు వినేవాళ్ళు లేకపోయారు. కొడుకుని చూడాలని కడదాకా కుమిలిన ఆ తల్లి ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు. ఆ తల్లి నాలుగున్నరేళ్ళ క్రితం అన్న మాటలు మాత్రం యిప్పుడూ వినిపిస్తున్నాయి. ‘‘నాకు హిందీ రాదు, వొస్తే- ‘మోదీ... నా కొడుకు గోకరకొండ నాగ సాయిబాబా చేసిన తప్పేమిటి?’ అని అడగాలని వుంది’’


ఆ తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం దొరక్కుండానే కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. సాయిబాబా యింకా జైల్లోనే వున్నాడు.


కరోనా దూరం నుండయినా చూడనిస్తుంది. కర్కశ రాజ్యానికి కరోనా పాటి జాలీదయా లేవు!

బమ్మిడి జగదీశ్వరరావు

(‘ఎకో ఆఫ్ ఫ్రీడమ్’ పుస్తకం ఇటీవల విడుదలైంది)


https://m.andhrajyothy.com/telugunews/citizenship-deshadrohama-202008130151579

No comments: